గుడ్లతోటలో పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులు

 

గుడ్లతోటలో పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులు

 

         ఈనాటి గడ్డిమేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం గుడ్లతోటలో అధిక దిగుబడులకి పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులు శీర్షిక కింద, నేలను పంటకి అనువుగా తయారుచేసుకోవడం, వేసుకోవాల్సిన ఎరువులు, ఉపయోగించాల్సిన పనిముట్లు మరియు పంట విత్తు దశ నుండి కాపు దశ వరకు పాటించాల్సిన నమగ్ర జాగ్రత్తలు తెలుసుకుందాం. కార్యక్రమ సమర్పకులు ఆచార్య N.G.నంద వ్యవసాయ విశ్వవిధ్యాలయం,భాగ్యనగరం వారు.

          మొదటగా, ఈ గుడ్లతోట ఆలోచనకి ఆధ్యుడిగా భావిస్తున్న శ్రీ కోడి.కనకయ్య గారితో మా యాంకర్ దేవిక ముఖాముఖి..

___________________________________________________________________________________

యాంకర్: హాయ్! కనకయా గారు..

కనకయ్య: నమస్కారమమ్మ…

యా: మీరేంచేస్తుంటారండి?

క: మా ఊర్లె నాకొక కోళ్లఫారం ఉందమ్మ. నేను కోడి లెక్క ఉన్న కాబట్టే నా పేరు కోడి కనకయ్య అయిందని అందరూ అనుకుంటుర్రు గని, అసలు విషయం ఏందంటే, నాకీ కోళ్లఫారం చానా ఏళ్లసంది ఉండుడుకు, `కోడి నా ఇంటిపేరు లెక్క ఉండిపోయింది.

యా: మీ భాష కాస్త వింతగా ఉందండి. ఇంతకి మీదే ప్రాంతం?

క: అమ్మా, నీకు KCR తెలిస్తే మా భాష ఎక్కడిదో వట్టిగనే తెలిసిపోతది. సరే నీకింకో అవిడియా ఇస్త, మాది కరీంనగర్ దగ్గర సిరిసిల్ల…

యా: సారీ అండి! KCR అంటే గుర్తొచ్చింది. ఇది టెలంగాణ కదా..!?

క: అమ్మా, నీకు తెల్వకపోతే సక్కగ ఊర్కో గానీ, ఎందుకమ్మ మా భాషని ఖూనీ చేస్తవ్!? టెలంగాణా కాదు,టెంకాయ పెంకూ కాదు… మాది తెలంగాణ.

యా: మళ్లీ సారీ సార్. నేను చెప్పింది కూడా అదే!

క: ..!…!…???

యా: సరేనండి, ఇంతకీ మీకీ తాట్ ఎలా వచ్చింది?

క: ఏదమ్మా, KCRని యాది జేసుడా..!?

యా: కాధు… కాధు… ఈ గుడ్లతోఠ గురించి.

(కనకయ్య చెవిలో మెల్లిగా) సార్, మీరు నన్ను పదే పదే అమ్మాఅనకంఢి ప్లీజ్.. అంతా నన్ను ఆంటీ అనుకుంటారు..

క: వో! గదా.. ఏం లేదు తల్లి..

యా: ( 😦 )

క: ఒకరోజు ఎప్పటిలెక్కనే పొద్దుగాల ఫారంకెల్లి గుడ్లన్నీ తీసుకచ్చి నా ఆటోల సదురుకున్న. గట్లపోయి చాయ్‍తాగి అచ్చేసరికి, నేను పెట్టిన గుడ్లల్లకెల్లి (!?) నాలుగు కిందపడ్డాయి. సరే, పోతె పోయినయి తియ్యి అనుకొని, ఇంటెనక పెరట్ల పారేసి వాటి గురించే యాది మరిసిన.

వారం తర్వాత మల్ల గిట్లనే ఇంకో గుడ్డు పలిగింది. సరే అని గదే జాగల మల్ల పారేద్దమని పోయేసరికి సూద్దును కదా, మొన్న పారేసిన నాలుగిట్లల్ల ఒకదానికి మొలకలెక్క కనిపిచ్చింది. అబ్బ మస్తు పరేశాన్ అయి, మా ఆడోళ్లకి సూపిస్తే ఆళ్లు కూడా మస్తు ఖుషీ అయిపోయి పెరట్ల టమాట తోట మధ్యల నాటిర్రు. రోజు నీళ్లుపోసి పెంచితెగదా, చెట్టుకి దగ్గరదగ్గర ఒక యాబైదాకా కాసినయి…

యా: ఏంటి సార్… కాయలా!!?

క: నీతల్లి! గవ్విట్లని కాయలెందుకంటర్.. అవేమన్న టమాటలా, వంకాయలా? అవ్విటిని గుడ్లు అనాలె!

యా: వావ్వ్ .. ఎలా ఉన్నయ్ సార్ అవి?

క: ఏం, బాగోగులు సూసుకుంటున్నట్టు అడగవడితివి? మంచిగనే ఉన్నయ్ తియ్యి.

యా: అయ్యో నేననేది అదికాదు కనకయాగారు, చూడడానికి ఎలాఉన్నాయి అని!

క: ఇంకెట్లుంటయ్!? గుడ్లనెప్పుడూ సూడలే!? గుండ్రంగా, తెల్లగున్నయి.

యా: గుడ్‍సార్.

క: నీ పిచ్చి సల్లగుండా! గుడ్ కాదే తల్లి, గుడ్డు అనాలె.. కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఎట్ల ఒర్రుతది, గట్ల.. గు..డ్డు.. అనాలె! సమజయిందా!?

యా: యస్ సార్.

క: (లోపల) నీ తలకాయ, నీకేం సమజయిందో నాకైతే అర్థమైతలే.. నీకెవడిచ్చిండే ఈడ ఉద్యోగం ?

యా: ఏంటిసార్ అంటున్నారు…?

క: ఆ… ఏం లేదు తల్లి! భలే సక్కగా మాట్లాడుతున్నవ్ అంటున్న..

యా: ఓకే సార్. చివరగా ఒక ప్రష్న..

క: అమ్మయ్య.. గట్లనే కానియ్య్

యా: సార్ మీరు ఎంథ కాలనికి ఈ విషయాన్ని జనజీవన స్రవంతికి చెప్పారూ?

క: గట్లంటవేంది!? నేనేమన్న అన్నల లెక్క కనపడుతున్ననా నీకు?, స్రవంతి, గది ఇది అని మాట్లాడుతున్నవ్. నేనిది పండించేటప్పుడు, పోశిగానికి, సొల్లు సురిగానికి, డిక్కి శీనుగానికి, కర్రె శీనుగానికి ఆఖరికి మా సుంకరి సారయ్యగానికి కూడా తెలుసు. కాకపోతే, గీ వ్యవసాయ ఇశ్పవిధ్యాలయామోల్లకి పోయినేడాది సూపించిన, ఆల్లు ఆ

గుడ్లమీద అవ్వీ, ఇవ్వీ పీకి, ఏదో పొడిచేసి, మీకు చెప్పి, మీరు మా ఊరోళ్లందరికి సూపించేసరికి ఇగో గీ యాల అయింది.

యా: డోంట్ వర్రీ సార్! ఎవ్‍రిబడి గోన్న వాచ్ దిస్ షో బయ్ టుమ్మారో!

క: ఏమో అంటున్నవ్?

యా: ఐమీన్.. ఓ .. సారీ… మీకు ఇంగ్లీష్ రాదు కదా..!

క: చిన్నప్పుడు మాఊరి బల్లె ఆరోతరగతి దాకా A,B,C,Dలు మా సదువుకున్న తియ్. కానీ ఇయ్యాల్ల డౌట్ వత్తుంది,

నేను సదివింది, నువ్వు సదివింది ఒక్కటేనా అని.

యా: ఓ.. రియ్యల్లి గ్రేట్ సార్! ఇంతకీ నేను చెప్పింది ఏంఠంటే, “మీరేమి బాధపడకండి, రేప్పొద్దుగాల మీ ఊర్ల ఇది వస్తది, అందరూ సూసి మస్తు ఎంజాయ్ చేస్తర్ అని!.

క: హమ్మయ్య! మనసుల జర ఖుషీ అయితాంది. మా ఊళ్లె అత్తదన్నందుకు కాదే తల్లి, నీ నోట్లకెళ్లి రెండు ముక్కలన్న తెలంగాణ భాష వచ్చినందుకు.

యా: (సిగ్గుపడుతూ..) ఉంఠాను సార్.

క: గట్లనే మల్ల, పోయిరా..!

యా: నేనుకాదు సార్.. వెళ్లిపోవాల్సింది మీరు..

క: (మెల్లిగా) అవ్ నీతల్లి! గంతమాటంటవులే నన్ను.. మా ఊరికి రా, నీయవ్వ కోళ్ల పెంట మధ్యల బొంధవెడత నిన్ను, ఏమనుకున్నవో..

యా: మళ్లీ ఏదో అంటున్నార్ సార్..

క: అబ్బే, గదేంలేదు తల్లి.. ఎప్పుడన్న మా ఊరికి నువ్వురావాలే, వస్తే, చాయ్ పోసి పంపిద్ధామని అనుకుంటున్న.

యాంకర్: ఓ.. ధట్స్ మై ప్లెషర్ సార్..

కనకయ్య: పొయ్యొస్తా ఇగ.

(మనసులో) నిన్నెవడు మంచిగ చెయ్యలేడు.. పో, నీ ఖర్మ!

___________________________________________________________________________________ 

మా యాంకర్  దీపికతో కనకయ్యగారి ముఖాముఖి చూసారు కదా. ఇఫ్ఫుడు గుడ్లతోటకి మొదటి దశలో కావాల్సిన పదార్థాలేమిటో చూద్దాం(!).. సారీ! పరిస్థితులేంటో చూద్ధాం.

 

ü      మొదటి 5 వేల గుడ్లు నాటుకోవడానికి ఒక ఎకరం బురదపొలం.

ü      ఎకరా మొత్తాన్ని కప్పిఉంచడానికి ఎనభై షామియానాలు.

ü      నీళ్ల సరఫరాకి ఒక కుళాయి.

ü      ఒక స్ప్రేయర్.

ü      ఒకటిన్నర మీటర్ల ముళ్లు కర్ర.

ü      ఐదు కిలోల ఎర్రకారం పొడి.

ü      ఒక కిలో ధనియల పొడి.

            ఇప్పుడు డా|| పొట్టి సత్తిగారు, పొలాన్ని పంటకి అనుకూలంగా మార్చుకోవడమెలాగో లైవ్‍లో పొలంనుండే వివరిస్తారు.

 

డా|| పొట్టి సత్తి: ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపుగా పెరిగిన గుడ్లతోట. (కిందికి వంగి) చూడండి, కింద నేల ఎంత నల్లగా మెత్తగా తినాలనిపించేలా ఉందో. ఇలాంటి అధిక దిగుబడులు “మీరూ సాధించాలనుకుంటూన్నారా? అయితే వెంటనే” రాబోయే 25ని||లు శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చూడండి. (కాస్త పక్కకి నడిచి..) మీరిపుడు చూస్తున్నది రభీ సీజన్‍కి సిద్ధం చేసిన పొలం.

 

నేల ఎంత సారవంతంగా ఉంటే దిగుబడీ అంత బాగా వస్తుంది. కాబట్టి కొద్దిరోజులు మీ పొలాన్ని మీ ఊరి ప్రజలకి ఉదయం, రాత్రి బ*భూమికి ఇవ్వాలి. నీరు కూడా, వచ్చినవాళ్లు కష్టపడకుండా పని కానిచ్చేసేలా, చేతికందేంత మొత్తంలో ఉండాలి. అప్పుడే భూమి బాగా నాని, పంటకి అనువుగా మారుతుంది. ఇదే సమయంలో 100 కిలోల కోళ్ల పెంట, 150 కిలోల ఆవు/బర్రె పెంట కూడా ఏరుకొచ్చి మరీ వెయ్యాలి.

 

ఓవర్ టూ స్టూడియో..

(మనసులో) ఎదవ జీవితం, పెంటల గురించి, పంటల గురించి చెప్పుకుంట, ఈ కంపు వాసనల మధ్య తిరుగుడైతుంది.

స్టూడియోలో: ధాంక్యూ పొట్టిగారు…

_____________________________________________________________

ఇప్పుడు విత్తన శుద్ధి, నాటుకునేటప్పుడు పాటించాల్సిన మెలకువలు, తొలిదశలో సోకే తెగుళ్ల నివారణ చర్యలగురించి వివరించడానికి స్టూడియోలో మనతోపాటు ఉన్నారు, “నందగిరి నంద వ్యవసాయ విశ్వవిధ్యాలయ ఉప కులపతి, డా|| ఆఉ శ్రీనుగారు.

 

వ్యాఖ్యాత: డా||ఆఉ గారు, విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి, అసలు నాణ్యమైన విత్తనం ఎలా ఎన్నుకోవాలి?

డా|| శ్రీను: ఆ… ఉ… ఏమీ లేదమ్మా! కాస్త పెద్దగా, పెంకు గట్టిగా ఉన్న నాణ్యమైన, శ్వేతాంబరి-I’, శ్వేతాంబరి-II’ లేదా సోనసోనియారకపు కోడిగుడ్లను ధర కాస్త ఎక్కువగా ఉన్నాకూడా కొనుగోలు చేయాలి. ఒక ఎకరాకి 5వేల గుడ్లవరకు సరిపోతాయి. బడ్జెట్ ఎక్కువైందని రైతు సోధరులు బాధ పడాల్సిన పనిలేదమ్మా.. దిగుబడులు వచ్చాక గుడ్లతో హోళీ చేసుకుంటారు, కావాలంటే నచ్చని నాయకులపై కూడా విసిరేస్తారు.

వ్యా: మంచిదండి. తర్వాత…

డా: ఈ గుడ్లని కొంతకాలంపాటు, అనగా ఒక 3 రోజులు అలా ఉండనివ్వాలి, ఎవ్వరి కంటా పడనివ్వకూడదు.  అలా చేస్తే గనక, చుట్టుపక్కలవాళ్లు  పప్పులోకి రెండు ఉడకబెట్టుకుంటాం వదినాఅనో, ’పిల్లోడు ఇంట్లోలేడు, ఒక రెండు గుడ్లు చేబదులు ఇవ్వగలరా పిన్నిఅనో, లేకపోతే దిష్టికి కావాలి ఒకటివమ్మాయ్అనో, విత్తడానికి ముందే సగం ఖాళీ చేసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా కాస్త కంట్రోల్డ్ గా ఉన్నపిమ్మట, బాగా మెత్తగా దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న పొలంలో, సాలుకి వంద చొప్పున, ప్రతి గుడ్డుకిగుడ్డుకి మధ్యలో అరమీటర్ ఎడం వదులుతూ విత్తుకోవాలి.

 

ఇలా మీరే చేతులతో విత్తుకుంటే నడుం పడిపోతుంది కాబట్టి, మా N.G.నంద వ్య.వి.వి వారు తయారు చేసిన కొత్త యంత్రం “కొక్కొరొక్కో“ని కొనుగోలు చెయ్యొచ్చు. అది ఒక గంట సమయంలో వెయ్యివరకు గుడ్లనుపెడుతుంది.

వ్యా: డా|| గా…. రు…

డా: ఆవేశపడకండమ్మా. మీ బాధ నాకర్ధమైంది. నేననేది మీరు అందులో వేసిన గుడ్లని పొలంలో పెడుతుంది అని. అలా విత్తుకుంటే గనక, 2 1/2 గం||ల్లోనే ఎకరా పని అయిపోతుంది.

వ్యా: ఆఉ గారు, 5 అనబోయి 2 1/2 అన్నట్టున్నారు?

డా: నేనేమీ నిశానిగాన్ని కాదమ్మా, ప్రొఫెసర్‍ని. నేను చెప్పింది, రైతులు రెండు “కొక్కొరొక్కో“లని కొంటే అలా తక్కువ టైమ్‍లో అయిపోతుందని. (మనసులో) నీకేం తెలుసమ్మా, సేల్స్ ఫర్ఫార్మన్స్ మ్యాటర్స్ ఇక్కడ.

వ్యా: ఓ! అలాగా

డా: ఆ! అలాగే… అలా విత్తుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత, ముందుగా మాట్లాడిపెట్టుకున్న ఎనభై షామియానాలని పొలం అంతటా ఎత్తుకోవాలి. లేదంటే గుడ్లు ఎండకు ఎండిపోయి, మొలకలు కూడా రాకపోయే ప్రమాదం ఉంది. తర్వాత ఒక వారం రోజులపాటు బయటి కోళ్లను ఆ పొలం దరిదాపుల్లోకి రానివ్వకూడదు. అవి గనక గుడ్లను పొదగటానికి ప్రయత్నిస్తే, మొదటికే మోసం వస్తుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి.

అలా మొలకలు వచ్చిన నాటినుండి రెండు వారాల కాలంలో మూడు సార్లు…

5 లీ|| – ప్లేభోయ్

3 లీ|| – ఆక్స్ డియోస్ప్రే

               1 లీ|| – చార్మినార్ అత్తరు, 50 లీ|| నీటికి కలుపుకొని పొలమంతా పిచికారి చెయ్యాలి. లేకపోతే మీరు పొలం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేనంత కంపు వస్తుంది. అలాగే ఈ దశలోనే పిల్లుల బెడద కూడా అధికంగా ఉంటుంది కాబట్టి,

1 లీ|| క్లోరిఫైరిఫాస్ పది లీటర్ల నీటికి కలిపి సిద్ధంగా ఉంచుకొని కనబడ్డ ప్రతి పిల్లిపై పిచికారి చెయ్యాలి. కుదరని పక్షంలో రెండు వేట కుక్కలను మా అనుబంధ సంస్థ అయిన “భౌభౌ గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ సప్లయర్స్ నుండి తీసుకొని కాపలాగా పెట్టుకోవాలి. కాకపోతే వాటికి ప్రతిరోజు 4 కిలోల నరమాంసం లేదా కనీసం అడవి దున్న మాంసం అయినా పెట్టాల్సి ఉంటుంది.

వ్యా: డా|| గారు, నరమాంసం అనే పదం మీడియాలో వాడకూడదు. కాబట్టి రేపు టెలికాస్ట్-లో సెన్సార్ చేస్తాం.

డా: మీరేమన్మా చేసుకోండమ్మా. వాటికి పెట్టకపోతే మాత్రమ్, ఆ రైతుని స్పెన్సర్స్ బ్రెడ్డులోకి సెన్సార్ లేకుండా నంజుకొని తినేస్తాయి. అయినా పరవాలేదు, ఆ సంస్థ వాళ్లు User Manualలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు చెప్తా…..

వ్యా: మరి ఈ దశలో సోకే తెగుళ్ల గురించి ఏమైనా…

డా: (మనసులో) అది చెప్పడానికే కదా వచ్చింది, చెప్పేదాక కూడా ఆగుతలేదా? ఎందుకు తొందర?.

(బయటికి) మంచి ప్రశ్న. ఈ దశలో ముఖ్యంగా వేరుకుళ్లు తెగులు సోకుతుంది. దీనికి నివారణ చర్యగా

 

  • 5 కి|| నత్రజని
  • 5 కి|| భాస్వరం
  • 5 కి|| కారంపొడి
  • 2 1/2 కి|| ధనియాలపొడి
  • ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకొని, మొక్క మొదల్లలో వేసుకోవాలి.

వ్యా: ఇన్ని జాగ్రత్తలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్.

డా: నమస్కారమమ్మా…

___________________________________________________________________________________

 చివరగా పంట కోత దశలో ఉన్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డా|| గాలి రజనీష్ గారు వివరిస్తారు…

ఓవర్ టూ ఫీల్డ్…

 

డా|| రజనీష్: హలో .. మైక్ టెస్టింగ్. వన్..టూ..త్రీ… ఒకేనా!… హలో.. హలో… (కెమెరామెన్:… స్టార్టయిందిరోయ్ ఆల్‍రెడీ..)

ఆ… ఇప్పుడు మనం NGNAU లోని పెద్ధపొలంకాడికి వచ్చినాము. ఒక్కసారి ఈ గుడ్డుపొలం వంక సూడండి… ఎంత సక్కగా పెరిగినాదో.. కాండం తెల్లగా అద్ధంలెక్క మెరుస్త ఉండాది, ఆకులేమో లేలేత పూరేకులలెక్క పసుపుపచ్చ రంగుల ఉండి, బర్రెలను ఆవులను ఆకర్షించేలాగున ఉండాయి. నేను ముఖ్యంగా సెప్పొచ్చేది ఏంటంటే, ఆకులు ఇంత అందంగా, మెత్త మెత్తగా ఉంటే మనిషినైనా నేనే ఆగలేగపోతున్నాను, ఇక పళ్లున్న ఏ బర్రెమాత్రం ఊరికే ఉంటది సెప్పండి. కొరికేసి కంపు కంపు సేసేత్తాయి. అందుకే రైతన్నయ్యలు ముళ్లుగర్రలు పట్టుకొని పొద్ధస్తమానం ఈడనే కూకోవాలె. అట్టయితనే పొలందక్కి దిగుబడులు బాగుగా వచ్చే అవకాశం ఉండాది.

ఇక పూత రాలి చిన్న చిన్నగా గుడ్లగుత్తులు కాసేయేల పోరగండ్లు వచ్చి రచ్చ రచ్చ చేయకుండా మీ పొలం ముందు, ఒక బోర్డుపెట్టాలె.. ఏమనంటే, “ఈ పొట్టి గుడ్లు తిన్నోళ్లు, మగ పోరగండ్లయితే మీసాలు రావు, ఆడి పోరగండ్లయితే జడలు పెరుగయి” అని.

 ఇక చివరగా కోతల సమయానికి, సాలా జాగ్రత్తగా, రాలి కిందపడి పగలకుండా గుడ్లన్నీ ఏరాల. ఇలా ఏంతో శ్రద్దతో గుడ్లన్ని ఏరినాక, ఇక పొలంని బర్రెలకే ఇడుస్తరో, పోరగండ్లకే ఇడుస్తరో, లేక కోసి అమ్ముకుంటరో రైతన్నయ్యల ఇష్టం.

 

(ఓవర్ టు స్టూడియో అక్కియ్య…)

____________________________________________________________

చూశారుగా గుడ్లతోటలో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలగురించి. మరిన్ని వివరాలకి ఉత్తరం రాయండి. మీ ఉత్తరాలకోసం చెట్లకి గుడ్లు కాసేలాగా.. సారీ, కళ్లు కాయలు కాసేలాగా  ఎదురుచూస్తూ ఉంటాం.. తిరిగి రేపటి కార్యక్రమంలో పందుల పెంపకంలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఇదే సమాయానికి కలుద్దాం.

 

గడ్డిమేత ప్రతిరోజూ రాత్రి ఒంటి గంటనుండి ఒకటిన్నర వరకు. శుభరాత్రి….

 

(టైటిల్స్… బ్యాక్‍గ్రౌండ్ సాంగ్)

 

                                    గడ్డిమేత.. గడ్డిమేత.. మీ గడ్డిమేత..!

 

                                    సస్యరక్షణకి పశుపోషణకి శాస్త్రవి………

 

                                                       (శుభం)

ప్రవీణ్ కుమార్ నందగిరి

http://www.hydbachelors.wordpress.com

http://koodali.org

http://lekhini.org

 

 

          *            *          *

ప్రకటనలు

10 thoughts on “గుడ్లతోటలో పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s