తెలుగుకి ఎందుకు చేయాలి ఇదంతా?

అప్పుడే భోజనం ముగించుకొని, సౌదీ బావగారితో చాటింగ్ చేస్తుండగా, అసంకల్పితంగానే కంప్యూటర్ స్రీన్ మూలన నక్కిన అంకెలు నాకంటపడ్డాయి. అవి అప్పుడు 2:55PMగా చూపిస్తున్నాయి. ఇంక బావగారికి టాటా చెప్పేసి, సూపర్‍వైజర్‍కి బైబై చెప్పేసి, జీమెయిల్‍లో వీవెన్‍కి హై-బై చెప్పేసి గేట్ వైపుకి అడుగులు వేయడం ప్రారంభించాను. నిజానికి ఆఫీసులో నిజమైన పని ప్రారంభమయ్యేది అప్పుడే. బోజనం వల్ల వచ్చే బద్దకం కొద్ది కొద్దిగా వదులుతూ, డెడ్‍లైన్ ఊహల్లో చేరి బయపెడుతూ, వేళ్లు చక చకా మీటలను నొక్కేది కూడా అప్పుడే… కానీ ముందస్తు అనుమతి సంపాదించడం,ఉదయం 2 గంటలు ముందుగా రావడం, ఈ రోజుకి చెయ్యాల్సిన పని దాదాపుగా పూర్తి చేయడం వల్ల ఎలాంటి అడ్డంకి లేకుండా బయటికి రాగలిగాను.

 

మెహెదీపట్నం, లకిడికాపూల్ ల మీదుగా నాలుగైదు బస్సులు మారి,4 గంటలవరకు సచివాలయం ముందు ఉన్నాను. అక్కడి నుండి భయపడుతూనే హైద్రాబాద్-ఆటో ఎక్కి మరో పది నిమిషాల్లో పీపుల్శ్-ప్లాజా దగ్గర దిగాను. నేను విద్యార్థి దశ దాటిపోవడం వల్ల 5/- టికెట్ తీసుకొని లోనికి వెళ్లి కుడివైపు రెండు అడుగులు వేశానో లేదో.. భాషాబందువులు సాదరంగా నన్ను ఆహ్వానించారు. నల్లమోతు శ్రీధర్, కట్టా విజయ్ మరియు భార్గవ రామ గార్లు మన తెలుగు గుంపు నిర్వహిస్తున్న గుడారంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత శనివారం ఒకసారి వచ్చి ఉండడం వల్ల అక్కడి వాతావరణం కొత్తగా ఏమీ అన్పించలేదు. కావున వెంటనే రంగంలోకి దూకి e-తెలుగు బ్యాడ్జిని ధరించి, మన కరపత్రాల్లో ముద్రించబడని lekhini.org లంకెని ప్రతి పత్రం చివర్లో రాస్తూ కూర్చున్నాం. కాసేపట్లో కశ్యప్ గారు,హరిహరణ్ గారు (ముద్దుపేరు) మరో ఇద్దరు బ్లాగర్లు జతకలిసారు.

 

అలా కాసేపు రాసామో లేదో, ప్రముఖ మనోతత్వవేత్త డా|| వి.నగేశ్ గారు మన స్టాల్‍కు విచ్చేశారు. సంతోషంగా అంతర్జాలంలో తెలుగు వెలుగు గురించి వివరించిన పిమ్మట, అంతే సంతోషంగా మనల్ని అభినందించి వెళ్లారు. తర్వాత ఈటీవిలో తెలుగు-వెలుగు కార్యక్రమ వ్యాఖ్యాత ’మృనాలిని’ గారు మరియు ఇతర ప్రముఖ వైద్యులు కూడా మన స్టాల్‍ను సందర్శించినవారిలో ఉన్నారు. సమయాభావం వల్ల ప్రముఖ కవి డా||సి.నారాయణరెడ్డి గారు స్టాల్‍ వరకు రాలేకపోయారుకానీ, మన కరపత్రాన్న మరియు చిన్న పుస్తకాన్ని వారికి అందజేయడంలో భార్గవ గారు సఫలీకృతులయ్యారు.

 

వారి వారి రంగాల్లో ఎంతో పేరు, అనుభవం గడించిన పెద్దవారికి మనకు తెలిసిన నాలుగు విషయాల్ని వివరిస్తుంటే, దాన్ని వారు శ్రద్ధగా వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని ఆనందం వెల్లివిరిసింది. విని మన ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందింస్తుంటే ఆ ఆనందం రెట్టింపయింది.

అదే సమయంలో తెలుగు రాని తెలుగు పిల్లల్ని (మీరూహించింది కరక్టే, ఇ/మీ పిల్లలు) పిలిచి, “ఈ సంగతి మీకు తెలుసా!?” అంటే, “సారీ అంకుల్ (?).. వ్‍య్ డోంట్ నో తెలుగ్గు… వ్‍య్ కాన్‍ట్ రీడ్ తెల్లుగు… వ్‍య్‍కెన్ ఒన్‍లీ స్ఫీక్ ఇట్ !” అని చెప్పి వెళ్లిపోతూ ఉంటే చాలా బాదేసింది. నిజం చెప్పాలంటే 30 ఏళ్ల పైబడ్డ వాళ్లల్లో ఉన్న జిజ్ఞాస యువత మరియు నవతలో అంతగా కనిపించనేలేదు.

 

అలా వచ్చిన ప్రతివారికి కరపత్రం అందించి, ప్రతిదానిపై “తెలుగులో సులభంగా రాయటానికి – lekhini.org” అని రాస్తూ, విడమరిచి చెప్పి, ల్యాప్‍టాప్‍లో ప్రయోగపూర్వకంగా లేఖినిని వాడి చూపించి, వారి ఈమెయిల్,ఫోన్ వివరాలు తీసుకొని, వాటిని ఎప్పటికప్పుడు ల్యాప్‍టాప్‍లో అప్‍డేట్ చేస్తూ ఉన్నా కూడా అసలు ఒక్కక్షణం ’అనవసరంగా కష్టపడుతున్నాం’ అన్న భావన కలగకపోవడం, పైపెచ్చు, విన్నవారు ఒక్కమాట, “నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం” అనగానే, పడ్డ కష్టమంతా దూదిపింజల్లా తేలిపోవడం తెలుగుతల్లిపై మనకున్న మమకారానికి తార్కాణంగా అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది ’ఇందుకు చెయ్యాలి ఇదంతా!’ అని.

 

వీటన్నిటికి మించి చెప్పుకోవాల్సిన విషయం, అక్కడ ఉన్న సభ్యులమధ్య స్నేహపూర్వక వాతావరణం. ఎవరికి ఎవరూ అంతగా పరిచయం లేకపోయినా ఏదో తెలియని బంధం, “మనమంతా ఒక్కటి – మన లక్ష్యం ఒక్కటి” అన్న దృఢ సంకల్పాన్ని మనలో రగిల్చింది. మళ్లీ నా చిన్ననాడు NCC సంఘసేవలో భాగంగా వీధిలోని పిల్లలందరికి పోలియోచుక్కలు వేసిన రోజులు గుర్తుతెచ్చింది..లీలగా…

 

రాత్రి 8:30 కావస్తుండగా అందరం బయల్దేరడానికి సన్నద్దమయ్యాం. శ్రీధర్‍గారు, హరిహరణ్ గారితో కలిసి KP వైపు, నేను భార్గవుడితో కలిసి లకిడీకాపూల్ వైపు, విజయ్ -x-స్వామి గారితోకలిసి ఇంకోవైపుకి కదిలాం, “శుభరాత్రి, జై తెలుగు భాషా.. జైజై తెలుగు భాషా…” అనుకుంటూ…

ప్రకటనలు

11 thoughts on “తెలుగుకి ఎందుకు చేయాలి ఇదంతా?

 1. చదువరి గారు, పుస్తక ప్రదర్శనలో బ్యానర్ పెట్టే ఆలోచన బాగుంది. మరి మన బ్లాగర్ల పిల్లలు అందరికీ తెలుగు వచ్చంటారా.కొన్ని వ్యాఖ్యలలో చదివాను మామీ, డాడీ అని పిలిచే, పిలిపించుకునే బ్లాగర్ల గురించి, సగం ఆంగ్లము లో మాట్లాడే పిల్లల గురించి. మరి వీరి కోసం ఏమి చేద్దామంటారు?

 2. స్నేహ:
  “బ్లాగర్ల పిల్లలు అందరికీ తెలుగు వచ్చంటారా” – బ్యానరు అందరి పిల్లలకీ అన్వయిస్తుంది కదా! కాదా?
  “సగం ఆంగ్లము లో మాట్లాడే పిల్లల గురించి” – దీని కోసం నేజెప్పిన బ్యానరు పనికిరాదు. “మీకు సరైన తెలుగొచ్చా?” అని అడగాలి. సరైన తెలుగు మనకే రాదు (నాకు రాదు), ఇక పిల్లకాయల్నేమడుగుతాం?

 3. ’ఇందుకు చెయ్యాలి ఇదంతా!’

  1. ఒక మంచి పని కాబట్టి
  2. మన ఆత్మ సంతృప్తి కోసం

  తెలుగు భాషపై మీ అభిమానానికి సంతోషం.
  మీ శ్రమ వృదాగా పోదులెండి. సంతోషంగా వుండండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s