వీడ్కోలు నవంబరు 24, 08
Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.Tags: Love
4 comments
కళ్లల్లో నీ రూపు దాచినపుడు తెలియంది..
కన్నీరులా రూపు దాల్చినపుడు తెలిసింది…
జారిన అశ్రువు అందదని..
చేజారిన నిన్ను పొందనని…
వీడిపోయిన ఙ్ఞాపకాలకి.. వీడ్కోలు ఇక…!
కవిత – కచిత నవంబరు 1, 08
Posted by నంద in గుర్తుకొస్తున్నాయి.add a comment
కవిత – కలలెన్నిటినో వివరంగా తవ్వుకోవడం…
కచిత – కలల్లన్నిటిని చిన్నగా తడుముకోవడం…
వీటిలో మొదటిది అందరికీ తెలిసిందే…. ఒకరి ఆలోచనలకు సవివరమైన అక్షర రూపం ఇవ్వడమే కవిత…
మరి కచిత?
ఆ ఆలోచనల పరంపర మొత్తాన్ని మూడుముక్కల్లో (కుదరకపోతే నాలుగు) తేల్సిచెప్పేయడం…
అనడానికి నాకు సరదాగా ఉన్నా… వినడానికి మీకు కొత్తగా ఉన్నా… వింతగా అన్పించి చెబుతున్నా…
ఒకరకంగా చూస్తే ఒక మామూలు కవితకు ఇది టైటిల్ లాంటిది… కాకపోతే మరీ ఒకటీ లేక రెండు పదాల్లో చెబితే విషయం పూర్తిగా అర్థమవ్వకపోవచ్చుననే ఉద్యేశంతో… దీన్ని తీసుకురావడం జరిగింది.
కావున ఇకపై రాబోయే నా కవితలకి (ఒకవేళ వస్తేగనక..) తప్పకుండా ఒక ’కచిత’ని ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. (మీరుకూడా ఈ ప్రయోగాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను)
ఉదా|| నా చిన్ని చిన్ని కవితలు, “కళాశాలలో…”, “నా కవిత – 1″ మరియు “నా కవిత-2″ లకి కచితలను కమనించండి.
డిస్ల్కేయ్‍మర్: ఇలాంటి పదము (కచిత) తెలుగు నిఘంటువులో ఇంతకుముందుగానే నమోదు అవలేదని, దీనికి ఎలాంటి విపరీతార్థాలు లేవని తలంచి ఈ పదానికి ఈ అర్థాన్ని ఇవ్వడం జరిగింది.ఒకవేళ అలాంటివి ఉండి ఉంటే తెలపవలసిందిగా…అందరికి నా మనవి.
ఉదారత్వానికిది సమయము సెప్టెంబరు 1, 08
Posted by నంద in వెబ్ సహాయం.2 comments
తెలుగు బాషాభిమానులకి నమస్కారములు. ఒక మంచి పని నిమిత్తము మీకు ఈ ఉత్తరం పంపడం జరిగింది.
నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో పనిచేస్తున్నానని మీకు తెలిపేఉంటాను. మా సహోద్యోగి అయిన నిర్మల్ గారు, ఈ నెల రెండవవారంలో వాళ్ల స్వగ్రామం వెళ్లినప్పుడు, వాళ్ల ఇంటికి సమీపంలో నివసించే ‘వీనస్’ అనే 15 ఏళ్ల కుర్రాడు విపరీతమైన జ్వరంతో బాధపడడం చూసి చలించి, కాకినాడ ఏరియా ఆసుపత్రిలో చూపించగా, హైదరాబాద్ నిమ్స్ కి సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ పరీక్షలన్ని ముగిసాక తెలిసిన విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి రక్తంలోని ఎర్రరక్తకణాలు క్రమక్రమంగా విభజన చేందుతూ, రక్తంలో వాటి పరిమాణం గణనీయంగా తగ్గుతోందని.

దయచేసి, మీ పరిధిలో ఈ విషయాన్ని గురించి ఆలోచించి, మన తెలుగు బ్లాగర్లకి తెల్పి బాబుకి ఏమైనా సహాయపడగలమేమో ఆలోచించండి.
బాబు యొక్క nims_report, సాక్షి పత్రికలో అతడిపై వచ్చిన కథనాన్ని, ఆ బాబు యొక్క ఫోటోని జతచేయడం జరిగింది. గమనించగలరు.
ఇట్లు మీ
‘భాగ్యనగరం’ ప్రవీణ్ కుమార్
ప్రవీణ్ కుమార్ (ఈమెయిల్): pravynandas@gmail.com
మార్చినెల తెలుగు బ్లాగర్ల సమావేశం – హైదరాబాద్ మార్చి 10, 08
Posted by నంద in భాగ్యనగర్ భాతఖాని.23 comments
[ ముందుమాట ]
సమయం : 3-28 ని||లు స్థలం : జూబ్లిహిల్స్ దారిలో ఆర్.టి.సి బస్సు
నిర్ధేశిత సమయానికి 28 ని||లు అప్పటికే ఆలస్యమైంది. తాజా సమాచారం కోసం వీవెన్ గారికి మొట్టమొదటిసారిగా కాల్ చేశాను.
నేను : వీవెన్‍గారు , నేను ప్రవీణ్‍కుమార్ నండి !
వీవెన్ : నందగిరి గారా ?
ప్ర: అవునండి….
వీ: చెప్పండి
ప్ర: జూబ్లిహిల్స్ దగ్గర్లో బస్‍లో ఉన్నాను. ఒక పావుగంటలో వస్తానండి. కార్యక్రమం ఎక్కడవరకు వచ్చింది ?
వీ: ఇప్పుడే పార్క్ లోకి వెళ్తున్నామండి. పర్లేదు రండి.
ప్ర: సరే… వస్తున్నానండి. (కాల్ డ్రాప్ చేశాను. మనసు కాస్త స్థిమిత పడింది)
మరో 15 ని||లల్లో కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. లోనికి వెళ్తూ, వీవెన్ గారికి మళ్లీ ఫోన్‍చేసి సమావేశ స్థలానికి దారి కనుక్కొని, 2 ని||ల్లో అక్కడకి చేరుకున్నాను.
[ సమావేశం ]
ఒక చిన్న మానవచక్రం పచ్చిక బయళ్లల్లో సేదతీరుతోంది. 8 మంది ఉండొచ్చు. కాస్త బిడియంగానే వెళ్లి, ఆ చక్రంలో భాగస్వామినయ్యాను. అప్పటికే ‘నా ప్రపంచం’ సి.బి.రావు (సింపుల్‍గా రావు గారు అనుకుందాం), వీవెన్ మరియు త్రివిక్రమ్‍గారితో ‘శోధన’ లో ఉంచబడిన బ్లాగ్ ర్యాంకింగ్‍ల గురించి చర్చిస్తున్నారు. అంతలోనే ‘శోధన’ సుధాకర్‍గార్ రానే వచ్చారు, చేతిలో డిజిటల్ కెమెరాతో…
మరి కాసేపటికి ‘చదువరి’ కిషోర్* గారు, ‘సత్యశోధన’ సత్యసాయిగారు(వారి అమ్మాయి శ్రావ్యవరాళి గారితో కలిసి), ‘ఈనాడు-పెన్’ శర్మగారు(వారి సతీమని, కుమార్తె సుమబాల, స్నేహితుడు శాస్త్రిగారితో కలిసి), ‘హరివిల్లు’ శ్రీనివాస్‍గారు, ‘ఈనాడు-క్లిక్’ వసంత్‍గారు, జాన్‍హైడ్ కనుమూరి గారు, చివరగా ‘ఆదిబ్లాగర్’ చావాకిరణ్‍గారు విచ్చేసారు.
20 మంది వరకు సభ్యులు చేరాక, పరిచయ కార్యక్రమాలు మొదలై – పూర్తవగానే, రావుగారు ‘శోధన’లో ప్రచురించబడిన బ్లాగ్‍ర్యాంకింగ్‍లపైన చర్చ లేవనెత్తారు. అరగంటపాటు చాలా రసవత్తరంగా సాగిందా చర్చాకార్యక్రమం. సరదాకి అదొక వా(బ్లా)గ్యుద్ధమనుకోవొచ్చు. ఇక్కడ ‘రసవత్తరం’గా అని ఎందుకన్నానంటే, ఆ అరగంటలో దాదాపు ప్రతీ బ్లాగరు, ‘శోధన’ సుధాకర్‍గారు చెప్పిన ఏదో ఒక విషయాన్ని వారి బ్లాగ్‍కి అన్వయించుకొని ఉంటారు. ఆ చిరు యుద్ధానికి ముగింపు వాక్యంగా “ఎవరి బ్లాగ్‍కి వారే సు-మ-న్” ను అందరూ అమోదించారు.(థాంక్యూ సుధాకర్‍గారు! బ్లాగ్, వెబ్‍సైట్ ల మధ్య ఉన్న అతిసన్నని తేడాని విడమర్చి చెప్పి ఇన్నిరోజుల నా సంధిగ్ధాన్ని తొలగించినందుకు…)
ఇక రెండవ చర్చ వీవెన్‍గారి తరఫున జరిగింది. ‘Betawiki’ గురించి కాసేపు వివరించారు. దాని ప్రకారం బీటావికీ మూడింటికై ఉద్దేశించింది:
1. మీడియావికీని, దాని పొడగింతలు మరియు ఇతర ప్రాజెక్టులని అనువదించడానికి ఓ వేదిక
2. వాటిని నడిపే వికాసకులకి పరీక్షా వేదిక
3. వికీలో అన్యభాషలు రాక దారితప్పిన బాటసారులకి ఒక ‘సైన్‍బోర్డ్’ లాంటిది.
ఈ బీటావికిపైన పద్మనాభం గారు మరియు వెంకటరమణగారు కొన్ని సందేహాలు వెలిబుచ్చినా, అవి వెంటనే నివృత్తి చేయబడ్డాయి.
RTS, తెలుగు అనువాద సమీకరణలు, కొత్త బ్లాగర్ల చేరికను ఇతర అంశాలుగా చర్చించారు. (RTS గురించి నాకేమి తెలియదు కాబట్టి, మీకేమి చెప్పలేను. క్షమించాలి). జాన్‍హైడ్ కనుమూరి గారి నూతన (మూడవ) రచన ‘అలలపై కలలతీగ’ కొన్ని ప్రతులను సభ్యులకి అందజేశారు.
చీకటి పడుతుండగా ‘క్లిక్’ వసంత్‍గారు, శర్మ & కో. గార్లు, సత్యసాయి మరియు వారి కుమార్తె నిష్ర్కమించారు. మిగిలిన వారు అలా అలా నడుస్తూ Cafetaria కి చేరుకొని టీ కాఫి లాంటివి సేవించి, వాటికంటే వేడిగా రాజకీయాలగురించి చర్చించుకొని ఒక్కక్కరుగా నిష్ర్కమించడానికి ఉద్యుక్తులమయ్యాం.
[ సమావేశంలో చమక్కులు ]
1. పదే పదే, “ఎవరి బ్లాగ్‍కు వారే సు-మ-న్” అనే వాక్యం విన్పించింది!
2. కొత్తగా పెళ్లయిన త్రివిక్రమ్‍గారిని పెద్దలు “కళ్యాణాయ – బ్లాగ్ వినాశాయ:” అంటూ తన బ్లాగ్విరామాన్ని గుర్తుచేసుకున్నారు (నవ్వులు…)
3. సత్యసాయిగారు వారి అమ్మాయిని పరిచయం చేస్తూ, “మా అమ్మాయి మొన్నే 7వ తరగతి పూర్తిచేసి..” అంటూ చెప్పేలోపే శ్రావ్యవరాళి గారు కల్పించుకుంటూ…”నాన్న! నేను పూర్తిచేసింది 7 కాదు, 8వ తరగతి…” అనగానే నవ్వులు విరిశాయి.
4. శర్మగారి పాప ‘సుమబాల’ అందరిమధ్యన చలాకీగా తిరిగింది. సరదాగా తనకి ‘బాల బ్లాగర్’ బిరుదిచ్చారు.
5. అలాగే పనిలో పనిగా ‘ఆది బ్లాగర్’ చావాకిరణ్‍గారికి ‘మెగా బ్లాగర్’, ‘పద్మ బ్లాగర్’ మరియు ‘బ్లాగ్ నన్నయ’ లాంటి బిరుదులను ప్రధానం చేద్దామనుకుని అడగగా, తను తన ‘ఆది’ పదవికి రాజీనామా సమర్పిస్తున్నానని చెప్పారు (నవ్వుతూ..), కానీ సభ అమోదించలేదు.
6. ‘లేఖిని’ మరియు ‘కూడలి’ లతో రెండు కళ్లు తెరిచిన వీవెన్‍గారిని ‘మూడో’కన్ను కూడా తెరవాల్సిందిగా సభికులు కోరారు.
7. సత్యసాయి గారు తెచ్చిన ‘స్వగృహ’సున్నుండలు clockwiseలోనూ, వేరొక సభ్యులు* తెచ్చిన మసాలా స్నాక్స్ Anti-clockwiseలోనూ తిరిగి అందరి నోటికి కాసేపు ఆనందాన్ని పంచాయి.
8. బ్లాగర్లు కాని ‘ఆ నలుగురు’ సభ్యులు :
1. పద్మనాభంగారి మిత్రులు నరసింహారావుగారు (రిటైర్మెంట్ దగ్గరలో…)
2. శర్మగారి మిత్రులు శాస్త్రి*గారు (M.C.A పూర్తిచేశారు…)
3. సత్యసాయిగారి కుమార్తె శ్రావ్యవరాళి గారు (9వ తరగతి విధ్యార్థిని…)
4. శర్మగారి సతీమణి మరియు పాప (2 సం||లు…)
* అనుకుంటా
[ వచ్చినవారు - clockwise seating order]
జాన్‍హైడ్ కనుమూరి
‘భాగ్యనగరం’ ప్రవీణ్
సత్యసాయిగారి కుమార్తె శ్రావ్యవరాళి
‘సత్యశోధన’ సత్యసాయి
‘హరివిల్లు’ శ్రీనివాస్
‘పొద్దు’ త్రివిక్రమ్
‘బ్లూటూత్’ కశ్యప్
‘శోధన’ సుధాకర్
‘కూడలి’ వీవెన్
‘ఆదిబ్లాగరి’ చావాకిరణ్
‘సింపుల్’ వెంకటరమణ
‘జాబిల్లి’ విజయ్‍కుమార్
‘ఈనాడు-పెన్’ శర్మ
శర్మగారి సతీమణి
శర్మగారి కుమార్తె సుమబాల
శాస్త్రిగారు
‘ఈనాడు-క్లిక్’ వసంత్
‘చదువరి’ కిషోర్
‘నా ప్రపంచం’ సి.బి.రావు
‘క్రుకీలు’ కృష్ణ
నరసింహరావుగారు
‘గ్రీటింగ్స్ తాతయ్య’ పద్మనాభంగారు
‘జాబిల్లి’ విజయ్‍గారు ఈ-తెలుగులో రాయడానికి ఈ సమావేశాపు వ్యాసాన్ని దత్తత తీసుకున్నారు. వీవెన్ గారు వ్యాసాన్ని నా బ్లాగ్‍లో రాయాల్సిందిగా సమావేశానికి మొదటిసారి హాజరైన నన్ను నియమించారు (
కానీ వివరాలేమి అందించలేదు). కావున నా మదిలో దాచిన అన్ని జ్ఞాపకాలను ఇక్కడ ఉంచే ప్రయత్నం చేశాను, ఏవైనా మరచిఉంటే పెద్దమనసుతో క్షమించగలరు…
వచనం : ‘ప్రణభాంకుర’ నందగిరి ప్రవీణ్ కుమార్







